నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త…
పవన్ కళ్యాణ్ గారితో అరగంట భేటీ.. కీలక ప్రాజెక్టుపై చర్చించాం: అజయ్ అరసాడ
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ.. వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణం, సంగీతంపై తన అభిప్రాయాలు, ఏఐ ప్రభావం, పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీ తదితర అంశాల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
మాది వైజాగ్. మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్‌కు మంచి అనుబంధం ఉంది. టీసీఎస్‌లో దాదాపు ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. దేవీ శ్రీ ప్రసాద్ నాకు ఎంతో స్ఫూర్తి. మా అమ్మ, భార్య ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లో శ్రీ చరణ్ నాకు మంచి స్నేహితుడు. ఆయన ‘గూఢచారి’ సినిమాకు నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నారు.
చిన్న సినిమాలకు పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
చిన్న సినిమాలకు పనిచేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మంచి ప్రొడక్షన్స్‌తో పనిచేశాను. పేమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడూ సమస్య రాలేదు. అందుకే ఆ విషయంలో నాకు పెద్దగా ఛాలెంజెస్ ఎదురుకాలేదు.

మీ మ్యూజిక్‌లో ప్రత్యేకమైన శైలి ఉండాలని అనుకుంటున్నారా?
నేను అన్ని రకాల జానర్స్, విభిన్న కథలకు పనిచేయాలని అనుకుంటాను. నా దగ్గరకు వచ్చిన కథకు న్యాయం చేయడమే నా లక్ష్యం. మాస్ కథ అయితే మాస్ మ్యూజిక్ వస్తుంది. కథ ఏ ప్రాంతానికి సంబంధించినదైనా, దానికి తగ్గట్టుగా కొత్తగా, ఫ్రెష్‌గా మ్యూజిక్ ఇవ్వాలని చూస్తాను.
బడ్జెట్‌ను బట్టి పాటల విషయంలో మార్పులు చేస్తారా?
ప్రతి సింగర్‌కు ఒక్కో రకమైన రెమ్యునరేషన్ ఉంటుంది. నా పాటకు ఎవరు సరిపోతారని అనిపిస్తే వారితోనే పాడిస్తాను. ఎందుకంటే చివరకు అది నా పాట. అది చాలా కాలం గుర్తుండిపోయేలా ఉండాలన్నదే నా ప్రయత్నం. కెరీర్ ప్రారంభంలో అనురాగ్ కులకర్ణితో పాడిస్తానంటే ఓ నిర్మాత వద్దన్నారు. ఇప్పుడు అదే నిర్మాత అనురాగ్‌తో పాటలు పాడించుకునే స్థితిలో లేరు.
థియేటర్, ఓటీటీ కోసం మ్యూజిక్ చేయడంలో తేడా ఏమిటి?
థియేటర్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్, స్కోర్‌ను డిజైన్ చేస్తాం. కానీ అదే కంటెంట్ ఓటీటీలోకి వచ్చినప్పుడు సౌండింగ్‌లో చాలా తేడా కనిపిస్తుంది. ‘వికటకవి’ని థియేటర్‌లో చూస్తే సౌండ్ పరంగా మరో స్థాయిలో ఉంటుంది. ఓటీటీలోకి వచ్చేసరికి నేను చేసిన పనిలో దాదాపు యాభై శాతం మాత్రమే ప్రేక్షకులకు అనుభూతి అవుతుంది.
మ్యూజిక్‌పై ఏఐ ప్రభావం ఎలా ఉంది?
ప్రస్తుతం ఏఐ వల్ల మ్యూజిక్‌పై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా ఏఐ రూపొందించే మ్యూజిక్‌లో ఒకే తరహా ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది నిర్మాతలు ఏఐ ద్వారా ట్రాక్స్ తయారు చేసి మాకు పంపిస్తుంటారు. అలాంటప్పుడు ‘మీరే కొట్టుకోండి’ అనిపిస్తుంది. ఏఐని ఉపయోగించి ఏ టెక్నీషియన్ అయినా తన పనిని సులభం చేసుకోవచ్చు. కానీ ఏఐని ఉపయోగిస్తే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారని మాత్రం అనుకోకూడదు.

పవన్ కళ్యాణ్‌తో జరిగిన మీ భేటీ గురించి చెప్పండి?
నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ అందిస్తుంటాను. ఇటీవల మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసిన సందర్భంలో నేను ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసిన పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించారు. నాతో పర్సనల్‌గా మాట్లాడారు. పొలిటికల్ ప్రాజెక్ట్స్ అయినా, పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసం అయినా కలిసి పనిచేద్దామని చెప్పారు.
జనసేన కోసం ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు?
వెంకట్ చిక్కాల అనే నా స్నేహితుడు అక్కడ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ద్వారా నాకు ఆ అవకాశం వచ్చింది. బన్నీ వాస్ గారు కూడా నాతో చాలా వర్క్ చేయించారు. ఆ పరిచయం నుంచే ‘ఆయ్’ సినిమా అవకాశం కూడా వచ్చింది.
మీరు బయట పెద్దగా కనిపించరు. కారణం?
నాకు బయటకు వచ్చి నా గురించి నేనే చెప్పుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. నేను కొంచెం ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లకు కూడా ఎక్కువగా వెళ్లను. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం నాకు తెలియదు.
పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ ఉందని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
ఆయన నాతో పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అనుకున్నాను. తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట పాటు నాతో మాట్లాడారు. చాలా విషయాలు చర్చించుకున్నాం. భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు.

మీ దగ్గర ఉన్న స్పీకర్ గురించి కూడా పవన్ కళ్యాణ్ అడిగారట?
నా దగ్గర కాఫీ మగ్‌లా కనిపించే బోస్ స్పీకర్ ఉంటుంది. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి అని అడిగారు. దాన్ని చేతిలోకి తీసుకుని సరదాగా చూశారు. కాఫీ కప్పులా ఉందని కామెడీ చేశారు. ‘కాఫీ పట్టుకొచ్చావా?’ అని కూడా జోక్ చేశారు. నాతో ఆయన అలా సరదాగా మాట్లాడటంతో లోలోపల చాలా సంతోషపడ్డాను.
ప్రస్తుతం దర్శకులతో పనిచేయడం ఎలా అనిపిస్తోంది?
గతంలో దర్శకులు సిట్యువేషన్, కాన్సెప్ట్ వివరించి దానికి తగ్గట్టుగా ట్యూన్ కావాలని చెప్పేవారు. ఇప్పుడు చాలామంది దర్శకులు సీన్స్ గురించి చెబుతున్నారు కానీ ఆ సీన్ వెనుక ఉన్న కాన్సెప్ట్, ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా వివరించలేకపోతున్నారు. కాన్సెప్ట్ క్లియర్‌గా తెలియకపోతే లిరిసిస్ట్ మంచి సాహిత్యం రాయలేడు, నేను కూడా సరైన ట్యూన్ ఇవ్వలేను.
మ్యూజిక్ క్రెడిట్స్ విషయంలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. రామ్ మిర్యాల గారు రెండు పాటలు ఇచ్చారు. మిగిలిన మ్యూజిక్ అంతా నేను చేశాను. కానీ మీడియాలో క్రెడిట్ మొత్తం ఆయన పేరుతో వెళ్లింది. ఈ విషయం గుర్తించిన బన్నీ వాస్ గారు ప్రతి ఈవెంట్‌లో నా పేరు చెబుతూ ఉండేవారు. మీడియాలో తప్పుగా వచ్చిన క్రెడిట్‌ను కూడా సరిచేయడానికి ప్రయత్నించారు. ‘సేవ్ ది టైగర్స్’ సమయంలో కూడా నా పేరు కాకుండా వేరే పేరు కనిపించింది. అయితే నేను మాత్రం నా టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా క్రెడిట్ ఇస్తాను.
పదేళ్ల సినీ ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నారా?
పేరుకి పదేళ్ల ప్రయాణమే అయినా మధ్యలో కరోనా వల్ల చాలా సమయం పోయింది. అయితే ఈ ప్రయాణంలో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ అందించగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. పెద్ద కమర్షియల్ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించగలననే నమ్మకం ఈ పదేళ్లలో సంపాదించుకున్నాను. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

