‘జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఆర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం…
‘భోగి’ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది ’: లిరిసిస్ట్ చంద్రబోస్

చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి అన్ని పాటలు రాసిన లిరిక్ రైటర్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
భోగి సినిమాలో పూర్తిగా తెలంగాణ మాండలికంలో పాటలన్నీ రాయడం ఎలా అనిపించింది?
-‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశాను. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమా ద్వారా రాసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాను.
-‘భోగి తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, ఆ పరిభాష, యాసలో రాసే పనిలో సఫలమయ్యామని భావిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే బోలెడంత సంతోషంగా ఉంది.
-సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలి. ‘రంగస్థలం’ సినిమాలో సుకుమార్ గారితో కలిసి గోదావరి మాండలికంలో పాటలు రాశాను. అలాగే ‘పుష్ప’లో చిత్తూరు యాస పరిశీలించి రాయడం జరిగింది. ‘భోగి’ సినిమాకు వచ్చేసరికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నా మూలాల్లోకి వెళ్లిపోతాం. ఆ మూలాల్లో తడి ఇంకా ఉంది. నేను 13 ఏళ్ల తర్వాత మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేశాను. కాకపోతే ఆ 13 ఏళ్లలో నేను నేర్చుకున్న భాష, ఆ పరిసరాలు, మాండలికం.. అవన్నీ ఇంకా నా లోపల ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే అదంతా పైకి వచ్చేస్తుంది. వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తినిచ్చిన పాటలు ఇవి. మాతృ మాండలికంలో పాటలు రాసే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
‘ఎగిలివారంగ’ పాట గురించి?
డైరెక్టర్ సంపత్ నంది గారికి కవిత్వం, పాటలు, సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. ‘ఎగిలివారంగ’ పాటలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాం. ప్రతి పాట కూడా ఒక కథలాగా ఉండాలి. ఇది నేను పాటించే నియమం. ప్రతి పాటకు ఒక అందమైన ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండాలి. ఆ రోజుల్లో ప్రజల జీవితాలు ఎలా ఉండేవి? వాళ్లు ఎవరి ఏలుబడిలో ఉండేవారు? వాళ్లను ఎవరు కట్టడి చేసేవారు? అవన్నీ కూడా కళ్లకు కట్టినట్టుగా సాహిత్యంతో చెప్పడం జరిగింది. అందుకే చాలామంది పర్సనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. తమ ఊరిలో ఉన్నట్టుగా ఉందని భావిస్తున్నారు.
-ఇది అందరికీ చెందిన కథ. కొన్ని ఏళ్ల క్రితం గ్రామాల్లో ప్రజల జీవితం ఎలా ఉండేది, ఎలా జీవించేవారు అనే విషయాలను ఇందులో చూపించాం. అందుకే అన్ని ప్రాంతాల వారికి ఇది కనెక్ట్ అవుతోంది. ఈ కథలోని సంఘర్షణ, భావోద్వేగం అందరికీ కనెక్ట్ అవుతాయి.
సింగిల్ కార్డు రాయడం ఎలా అనిపించింది?
రంగస్థలం, ‘పుష్ప’, ‘నేనొక్కడినే’ చిత్రాలకు కూడా సింగిల్ కార్డు రాశాను. సింగిల్ కార్డుతో రాయడం వల్ల ఒక పాట తర్వాత వచ్చే పాట ఎలా ఉండాలి, ఎలాంటి వైవిధ్యం చూపించాలి అనే విషయంలో ఒక వెసులుబాటు ఉంటుంది. కథకు సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పాలనే దానిపై పూర్తి అవగాహన ఉంటుంది.
భీమ్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-భీమ్స్‌తో ఇంతకు ముందు కూడా కలిసి పనిచేశాను. తను ప్రజల సంగీత దర్శకుడు. నేనంటే తనకి చాలా అభిమానం. నా స్ఫూర్తితో వచ్చానని చెబుతుంటాడు. తనతో పని చేస్తున్నప్పుడల్లా చాలా మంచి అనుభవం ఉంటుంది. ఇందులో నేను రాసిన పాటలకు కంపోజ్ చేశాడు. ‘అన్నయ్య ప్రాణంలో పూసిన పువ్వులు’ పాటను తను కంపోజ్ చేసిన తర్వాత నేను రాశాను. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. రెండు బిట్ సాంగ్స్, మూడు ఫుల్ సాంగ్స్. అన్నీ కూడా సిచ్యువేషన్ సాంగ్సే. ప్రతి పాటా సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. ముందు సాహిత్యం రాసి, ఆ పాటను స్వరపరిస్తే ఎక్కువ కాలం నిలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
మీ కెరీర్లో రాయడానికి ఎక్కువ సమయం తీసుకున్న పాట ఏది?
‘ఆర్ఆర్ఆర్’ పాట రాయడానికి 19 నెలల సమయం తీసుకున్నాను. రాయడం త్వరగానే రాశాను. కానీ ఆ పాటకు కంపోజ్ చేయడం, మార్పులు చేర్పులు.. మధ్యలో కోవిడ్.. ఇవన్నీ కలిసి 19 నెలలు పట్టింది. ‘నాటు నాటు’ పాట కంటే చాలా మంచి గీతాలు రాశాను. కాకపోతే ఈ పాటకే ఎందుకు ఆస్కార్ వచ్చిందనే దానికి ఒక చిన్న విశ్లేషణ ఉంది. ఇది ప్రేమ గీతం కాదు, బంధాల మధ్య ఉండే గీతం కాదు, తాత్విక గీతం కాదు. అది ఒక ఆడి పాడే పాట. మిగతా పాటల కంటే ఈ పాట వందకి వంద మార్కులు కొట్టింది. ఆ సంవత్సరం ఈ పాటకు మించి ఉర్రూతలూగించిన పాట ఏదీ లేదు. బహుశా నా సహనానికి అవార్డు వచ్చిందేమో అనిపించింది. (నవ్వుతూ) 31ఏళ్లుగా సాహితీ యజ్ఞం చేస్తున్నాను. భగవంతుడు ఈ రకంగా నన్ను కరుణించాడేమో అనిపించింది.
భోగి సినిమా చూశారా?
-చూశాను. చాలా అద్భుతమైన సినిమా. మంచి భావోద్వేగాలు ఉన్న కథ. ఉద్విగ్నభరితంగా సాగే కథనం ఉంది. శర్వానంద్ గారు, సంపత్ నంది గారిలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. కెమెరా, మ్యూజిక్, రచన, కథ, స్క్రీన్‌ప్లే.. అన్ని విభాగాలకూ మంచి గుర్తింపు తీసుకొచ్చి విజయాన్ని అందించే సినిమా అవుతుంది.
ప్రొడ్యూసర్ రాధామోహన్ గారి గురించి?
-రాధామోహన్ గారు చాలా మంచి స్నేహశీలి. మంచి వ్యక్తి. నన్ను చాలా ప్రేమగా, మర్యాదగా, గౌరవంగా చూసుకున్నారు. నా పాటలన్నింటినీ ఆస్వాదించారు.
ఇప్పుడు చాలా పాటలు వస్తున్నప్పటికీ, ఏదైనా మంచి పాట వినాలంటే మళ్లీ మనం పాత పాటలనే వింటాం కదా. ఈ ధోరణిని ఎలా చూస్తారు?
-దీనిని ‘టేస్ట్ ఫ్రీజ్’ అంటారు. మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాంటి పాటలు విన్నామో, అవే మనకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. కాకపోతే ఇప్పుడు కూడా చాలా మంచి పాటలు వస్తున్నాయి. సంగీత దర్శకులు మంచి పాటలు చేస్తున్నారు. అలాగే దర్శకులు కూడా ఇప్పుడు కథలో ప్రాధాన్యత ఉన్న పాటలు రాయించుకుంటున్నారు. ఇప్పుడు యుగళగీతాలు పూర్తిగా తగ్గిపోయాయి. మనం కాస్త మనసుపెట్టి వినగలిగితే ఇప్పుడు కూడా బోలెడన్ని మంచి పాటలు ఉన్నాయి.
-ఇప్పుడు ప్రతి పాటకీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఐటెం సాంగ్స్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ పాటల్లోకూడా చాలా తాత్వికత, లోతైన భావాలు ఉంటున్నాయి. నేను రాసిన ‘రింగా రింగా’ నుంచి మొన్నటి ‘పుష్ప’లోని ‘దెబ్బలు పడతాయి’ పాట వరకు చూసుకుంటే, ఆ పాటల్లో కూడా సమాజంలోని అంశాలను ప్రతిబింబిస్తూనే చక్కని తాత్వికత ఉంటుంది.
ఇప్పుడు క్యాసెట్లు, సీడీలు లేవు. యూట్యూబ్‌లో వ్యూస్ కౌంట్ అవుతుంది. దీన్ని గమనిస్తున్నారా?
-కచ్చితంగా. క్యాసెట్లు, సీడీలు, మెమొరీ కార్డులు.. ఇవన్నీ చూస్తూ వచ్చాం. నేనైతే గ్రామఫోన్ రికార్డులు కూడా చూశాను. ఇప్పటికీ ‘బొంబాయి ప్రియుడు’ క్యాసెట్ నా దగ్గర ఉంది. మొట్టమొదటిసారిగా సింగిల్ కార్డు రాసి నా పేరు వచ్చిన సినిమా ‘స్టూడెంట్ నంబర్ 1’. ఇప్పుడు యూట్యూబ్ వరకు వచ్చాము. పాట ప్రజల దగ్గరకు చేరే మార్గం మారింది, పాటను చేరవేసే సాధనం మారింది. పాట మారలేదు.
-పాటకు భావం ముఖ్యం. ఆ భావం ప్రజల భాషల్లో ఉండాలి. ప్రజల్లో చైతన్యం రగిలించాలంటే ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారి వాడుక భాషను మనం మాట్లాడాలి.
ప్రస్తుతం మీరు రాస్తున్న సినిమాలు?
-‘రౌడీ జనార్ధన’, ‘విశ్వంభర’, రామ్ పోతినేని గారి సినిమా, హిందీలో షారుక్ ఖాన్ గారి సినిమా, శ్రీ విష్ణు గారి సినిమా, ‘బరి’ సినిమాలకు రాస్తున్నాను.

