Skip to content

ఆగ‌స్టు 21 నుంచి సోనీ లివ్‌లో ప్రీమియర్ కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు.

చెన్నై సిటీ బ్యాగ్రౌండ్‌లో రూపొందిన ఈ క‌మింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇద్దరు యువ హృదయాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లవ్‌లోని ఉత్సాహం, అమాయకత్వం, ప్రేమలో ఎదురయ్యే బాధలను దాటుకుంటూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు.. ఎదిగే క్రమంలో తమను తాము తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంటారు.

ఓటీటీ ప్రీమియర్‌పై హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఫస్ట్ లవ్‌తో ముడిపడిన అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులు సినిమాపై చూపించిన ప్రేమ, ఆదరణ మా అందరి జర్నీని ఎంతో మధురమైన జ్ఞాపకంగా మార్చాయి. ఇప్పుడు సోనీ లివ్ ద్వారా ఈ కథ వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రేక్షకుల ముందుకు డిజిటల్ ప్రీమియర్‌గా రాబోతుండటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలోని పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, తమ ప్రేమ, ఎదుగుదల రోజులను మరోసారి గుర్తు చేసుకుంటూ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను ఎంత ఎంజాయ్ చేస్తూ తెరకెక్కించామో.. ప్రేక్షకులు కూడా అంతే ఆనందంగా చూస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. “మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ అందమైన దశను, మన ఫస్ట్ లవ్‌ను గుర్తు చేయడమే ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలోని ప్రత్యేకత. థియేటర్లలో సినిమాకు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన ఎంతో అద్భుతంగా ఉంది. అందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు కానుండ‌టం హ్యాపీగా ఉంది. కొత్త ప్రేక్షకులకు ఈ సినిమా చేరువ కావడంతో పాటు.. వారి జ్ఞాపకాల్లో, చర్చల్లో కూడా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓ భాగం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు నవ్వుతూ, ఆనందిస్తూ.. మా ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చిన ప్రతీ భావోద్వేగాన్ని ఫీల్ అవుతార‌ని అనుకుంటున్నాను” అన్నారు.

‘చెన్నై లవ్ స్టోరీ’ ఆగ‌స్టు 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సోనీ లివ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.

Link: https://www.instagram.com/p/DcBjx-5xsTE

Stills: https://drive.google.com/drive/folders/1SO4hIzWn65wOyDLvE1YUTBOx4FhRwnrx

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.