Skip to content

తన సంగీతంతో భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ – కమల్ హాసన్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం చేయబోతున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. రశ్మిక మందన్నపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ ఇచ్చారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ – ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి కుటుంబ సభ్యులకు, కర్ణాటక సంగీతకారులకు నా కృతజ్ఞతలు. గతేడాదిగా మా టీమ్ మొత్తానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ పేరు ఒక మంత్రం అయ్యింది. ఈ సినిమా పనులు ప్రారంభించినప్పుడు మనదేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నామని భావించాం. కానీ ఆమె జీవితం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆమె కేవలం ఒక గొప్ప సంగీత కళాకారిణి మాత్రమే కాదని, ఒక అసాధారణ జీవితాన్ని చూసినవారని అర్థమైంది. మధురైలో పుట్టిన ఆమె సౌతిండియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని తన సంగీతంతో అలరించారు. సినిమా కోసం ఆమె గురించి తెలుసుకున్నప్పుడు గొప్ప గొప్ప వేదికలు, అద్భుత సంగీత విభావరిలు, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారం ఆమె సాగించిన జీవనయానంలో ఒక భాగంగా మారాయనిపించింది. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఎంఎస్ అమ్మ ఒక కూతురు, ఒక కళాకారిణి, ఒక మహిళ. ఆమె తన జీవితంలో గొప్ప కలల్ని కన్నారు. జయాపజయాలు చూశారు. ఎన్నో త్యాగాలు చేశారు. వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని మేము అనుకున్నాం. ఇదొక కీలకమైన సినిమా అని నమ్ముతున్నాం. ఎంతోమంది యువతీయువకులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ రోజు గుర్తింపు అనేది రాత్రికి రాత్రే దక్కుతోంది. లైక్స్ షేర్స్ సబ్ స్క్రైబర్స్ రూపంలో ఫేమ్ ను , సక్సెస్ ను కొలుస్తున్నాం. కానీ ఎంఎస్ అమ్మ తన విజయాలను జీవితకాల క్రమశిక్షణతో, సహనంతో దక్కించుకున్నారు. ఈ పవర్ ఫుల్ మెసేజ్ ను ఈతరం వారికి మా సినిమా ద్వారా ఇవ్వబోతున్నాం. ఆమె జీవిత కథ ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాం. మేము తెరకెక్కించే ప్రతి సన్నివేశం ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ మీద గౌరవభావం, ప్రేమతోనే రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం మా టీమ్ అందరికీ గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ మీద మాకున్న గౌరవం, ప్రేమ, అభిమానం చూపించబోతున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ – మాకు ఎంతో సహకారం అందించిన ఎంఎస్ అమ్మ కుటుంబ సభ్యులు శ్రీనివాసన్, చంద్రశేఖర్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కు కృతజ్ఞతలు చెబుతున్నాం. రాక్ లైన్ వెంకటేశ్, అరవింద్ గారు మా అందరినీ ఈ సినిమా కోసం ఒక్కటయ్యేలా చేశారు, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. నేను దాదాపు పాతిక చిత్రాలు ప్రొడ్యూస్ చేశాను. వాటిలో జయాపజయాలు ఉన్నాయి. నేను నిర్మాతగా మారిన పర్పస్ ఏంటని అనిపించేది. కానీ ఈ సినిమా నిర్మించడంతో నిర్మాతగా నాకు సార్థకత చేకూరిందని భావిస్తున్నాను. యానిమేటర్ గా ఉన్న నన్ను ప్రొడ్యూసర్ గా మార్చింది అల్లు అర్జున్. ఆయన వల్లే నేను ఈ రోజు ఇంత గొప్ప సినిమా నిర్మించే అవకాశం పొందాను. చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం కొందరు స్టార్స్ అవడం మనం చూస్తున్నాం. ఎంఎస్ అమ్మ తన విజయాలను దేవుడికే అంకితమిచ్చారు. సాధారణ జీవితాన్ని గడిపారు. ఆమె జీవితం నన్ను ఇన్స్ పైర్ చేసింది. అమ్మ ఆశీస్సులు మాతో ఉన్నాయని నమ్ముతున్నాం. ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన నిజమైన, అరుదైన గౌరవంగా భావిస్తున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ – ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ బయోపిక్ రూపకల్పన కోసం మేమంతా కలలు కన్నాం. ఏడు ఎనిమిదేళ్ల ప్రయత్నం ఈ సినిమా వెనక ఉంది. ఏడేళ్లుగా ఆమె జీవితంపై రీసెర్చ్ చేస్తున్నాం. అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ తో కలిసి ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నిర్మాతలుగా మమ్మల్ని, దర్శకుడిగా గౌతమ్ ను, ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంఎస్ అమ్మే ఎంచుకుందని భావిస్తున్నాం. యాదృచ్చికంగా మేమంతా కలవడం రాసిపెట్టి ఉందని అనిపిస్తుంటుంది. ఎంఎస్ అమ్మ పాత్రకు నటిని ఎంచుకోవడం చాలా కష్టం. ఎవరు ఆమె పాత్రలో నటించి మెప్పించగలరు అని బాగా డిస్కస్ చేశాక రశ్మిక అయితే ప్రేక్షకుల్ని మెప్పించగలదు అని నమ్మాం. రశ్మిక ఈ సినిమాను ఎంతో సంతోషంగా అంగీకరించింది, ఎంఎస్ అమ్మ పాత్రలో నటించేందుకు ముందుకొచ్చింది. ఈ రోజు ఎంఎస్ అమ్మ 110వ జయంతి సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – ఎంతో బిజీగా ఉన్నా మేము పిలవగానే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కమల్ హాసన్ గారికి థ్యాంక్స్. ఈ ఆడిటోరియంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ చిత్రపటం చూడగానే కాసేపు ఎమోషనల్ ఫీల్ కలిగింది. ఆమే మమ్మల్ని ఈ సినిమా చేసేందుకు ఎంచుకుందనే భావనకు లోనయ్యాను. రశ్మికను కూడా ఆమే ఎంచుకుందని అనిపించింది. ఎంఎస్ అమ్మ గొప్ప సంగీతకారిణిగా మనందరికీ తెలుసు. కానీ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా ఇన్స్ పైర్ అయ్యాం. ఆమె పాటించిన నిబంధనలు, చూపించిన ధైర్యం, క్రమశిక్షణ చాలా గొప్పవి. ఆమె పదేళ్ల ప్రాయం నుంచే సంగీతం పట్ల తన ఇష్టాన్ని చూపిస్తూ గొప్ప లక్ష్యం వైపు చెదరని ఏకాగ్రతతో పయణించారు. ఎంఎస్ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని గడిపారో చాలామందికి తెలియదు. మా దర్శకుడు గౌతమ్ గత ఏడాదికాలంగా బయోపిక్ రీసెర్చ్ లో భాగంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు. ఎంతోమందిని కలిశారు. గౌతమ్ ఆయన టీమ్ గ్రేట్ వర్క్ చేశారు. గౌతమ్ ఒక పెద్ద సినిమాకు సంప్రదింపుల్లో ఉండగా మేము ఈ సినిమా కోసం అడిగిన వెంటనే ఆ ప్రాజెక్ట్ వదులుకుని వచ్చారు. ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ఏడేళ్లుగా ఈ సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. అమ్మ కుటుంబ సభ్యులను కలిసి రైట్స్ తీసుకున్నారు. అమ్మ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మా వెనక ఉండి ఈ సినిమా చేసేందుకు సహకరిస్తున్నారు. ఈతరం వచ్చే తరం మధ్య వారధిలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు న్యాయం చేయగలరు అనిపించింది. సుప్రభాతం మొదలుకుని ఎంఎస్ అమ్మ సంగీతం మనకు ప్రతి సామాజిక మాధ్యమంలోనూ వినిపిస్తుంటుంది. ఆమె సంగీతాన్ని రీక్రియేట్ చేసే సాహసం మేము చేయడం లేదు. అనిరుధ్ సంగీతంతో ఒక గొప్ప బయోపిక్ రూపొందిస్తున్నాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – నటిగా నాకు ఈ గొప్ప అవకాశం దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపోతోంది. ఎంఎస్ అమ్మ 110వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద నిల్చున్నందుకు దేవుడి సమక్షంలో ఉన్న భావన కలుగుతోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాపై ఉంటుందని నమ్ముతున్నాం. ఎంఎస్ అమ్మ పాత్రను మీ అందరికీ నచ్చేలా పోషించేందుకు సంపూర్ణ ప్రయత్నం చేస్తాను. అన్నారు.

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ మాట్లాడుతూ – తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ. ఆమె సంస్కృతం, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆమె పాట పాడినా భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. ఆమె సంగీతమే మనకు అందించిన సందేశం. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. అమ్మ ఆలపించిన సుప్రభాతం, లలితసహస్రనామం, రంగపుర విహార పాటలు వింటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మహాత్మాగాంధీ కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమాని. ఆమె పాటలు విని సంతోషించేవారు. అమ్మ బయోపిక్ నిర్మిస్తున్న అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్ కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ ప్రొడక్షన్స్ లో చేస్తున్న గొప్ప చిత్రమిది. అనిరుధ్ సంగీత ప్రస్థానం కూడా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లబోతోంది. దర్శకుడు గౌతమ్ పై చాలా బాధ్యత ఉంది. ఎంఎస్ అమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న రశ్మికను చూస్తే నేను అసూయపడటం లేదు. గడ్డం తీసేసినా నేను ఆమె పాత్రలో నటించి మెప్పించలేను. ఈ దేశ మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఐకానిక్ వుమెన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ. ఈ టీమ్ అందరికీ నా బెస్ట్ విసెస్ తెలియజేస్తున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ సుహాసినీ, నటుడు శివకుమార్, దర్శకుడు మహేంద్రన్, నటుడు, దర్శకుడు సముద్రఖని, ప్రొడ్యూసర్స్ కలైపులి థాను, రాజేంద్రన్, కాట్రగడ్డ ప్రసాద్, ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన సతీమణి మాల, తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్
డైరెక్టర్ – గౌతమ్ తిన్ననూరి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.