Skip to content

‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను: తేజ సజ్జ

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తో అలరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. స్టార్ హీరో తేజ సజ్జ ఈ షోని హోస్ట్‌ చేస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో పోటీదారులు నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? అనే ప్రశ్నల చుట్టూ గేమ్ సాగుతుంది. SOL Production నిర్మించిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తెలుగులో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 15నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా విలేకరుల సమావేశంలో షో విశేషాల్ని పంచుకున్నారు.

వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు కదా.. ది ట్రెయిటర్స్ కి హోస్ట్ గా మారడం ఎలా అనిపించింది?
-ట్రెయిటర్స్ గ్లోబల్‌గా చాలా పెద్ద హిట్ ఫ్రాంచైజ్. 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో చేశారు. హిందీలో కరణ్ జోహార్ గారు చేసినప్పుడు నాకు దాని గురించి పెద్దగా ఆలోచన లేదు. ఒక ఎపిసోడ్ చూడడం మొదలుపెట్టి రెండు రోజుల్లో మొత్తం సీజన్ పూర్తి చేశాను. నాకు అప్పుడే కాన్సెప్ట్, షో నచ్చింది.

-మిరాయ్ సినిమా పూర్తి అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు నన్ను సంప్రదించారు. నా కెరీర్‌లో చాలా త్వరగా ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఈ షో ఫార్మాట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి అన్ని భాషల్లో విజయవంతమైంది. ఆ నమ్మకంతో ఇమ్మీడియట్‌గా ఓకే చేశాను.

-ప్రైమ్ వీడియో లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌తో కొలాబరేట్ అవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. తెలుగులో ఇంత పెద్ద స్కేల్‌లో ఒక రియాలిటీ షో ఎప్పుడూ చూడలేదు.

-ఈ షో ఫార్మాట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజంగా ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమాలా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ షోను హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.

ఎన్ని రోజులు షూట్ చేశారు? హోస్ట్ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది?

-11 రోజులు షూట్ చేశాం. మొత్తం పది ఎపిసోడ్లు. నేను హిందీ వెర్షన్ చూస్తున్నప్పుడు అందులో నాకు పార్టిసిపెంట్స్‌తో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదు. వాళ్లు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. కాకపోతే ఇక్కడ ప్రగతి గారు, హర్షవర్ధన్ గారు, చిన్మయి గారు.. వీళ్లందరూ కూడా మనకి తెలిసిన వ్యక్తులు. వీళ్లు ఎలా బిహేవ్ చేస్తారో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

– హోస్ట్ క్యారెక్టర్ కూడా ఇందులో చాలా కీలకం. అది కూడా ఒక సినిమాలో పోషించిన ఒక క్యారెక్టర్ లాంటిది. నేను ఆ హోస్ట్ క్యారెక్టర్‌లోనే బిహేవ్ చేయాలి. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. క్లాస్ లీడర్ లాంటి క్యారెక్టర్.( నవ్వుతూ)

గేమ్ షో ఎలా ఉండబోతుంది?
ఇందులో మొదటి మూడు ఎపిసోడ్లు వస్తాయి. ఆ మూడు ఎపిసోడ్లు చూసిన తర్వాత ఈ గేమ్ షోపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇదంతా ఒక మర్డర్ మిస్టరీ లాగా ఉంటుంది. .తెలుగులో ఇప్పటివరకు చూసిన ఏ రియాలిటీ షోతో దీనికి పోలిక ఉండదు. చాలా కొత్త ఫార్మాట్. నిజంగా ఒక రియల్ గేమ్‌లాగా ఉంటుంది. ఫుట్‌బాల్, చెస్.. ఎలా అయితే కొన్ని రూల్స్ ప్రకారం కంప్లీట్ గేమ్‌లాగా ఉంటాయో.. ఈ రియాలిటీ షో కూడా కంప్లీట్‌గా ఒక గేమ్‌లాగా ఉంటుంది.

ఇది కొత్త గేమ్ షో అంటున్నారు కదా? ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుందా?
మొదటి మూడు ఎపిసోడ్లు రిలీజ్ అవుతాయి. ఆ మూడు ఎపిసోడ్లు చూస్తే అసలు ఏం, ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? ఎవరు అమాయకులు? అనే కోణంలో నడిచే ఈ గేమ్ ఒక థ్రిల్లర్ లా వుంటుంది.

ఇందులో కంటెస్టెంట్స్‌ను ఎలా సెలెక్ట్ చేశారు?
-దీనికిగేమ్ ఆడే వాళ్లు చాలా ముఖ్యం. మానిపులేట్ చేయగలగాలి, నమ్మించగలగాలి, గేమ్స్‌లోని రూల్స్ తెలిసి ముందుకెళ్లగలగాలి. దాదాపు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లని ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీగా ఉండటం అనేది దీని ప్రియారిటీ కాదు. గేమ్ ఆడటం అనేది ప్రియారిటీ.

కోటి రూపాయలు ప్రైజ్ మనీ అంటున్నారు కదా? ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది?
-అది మీరు గేమ్ షో చూసి తెలుసుకోవాలి.

హోస్ట్ చేయడం ఎలా అనిపించింది?
-నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే ఈ షో నాకు చాలా ఇష్టం. నేను ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడతాను. చాలా ఈజీగా చేయొచ్చని అనుకున్నాను. వీళ్లు మొదటి రోజు నాలుగైదు పేజీలు ఇచ్చారు. పార్టిసిపెంట్స్‌కి రూల్స్ అన్నీ చెప్పాలన్నారు. ఈజీగా చెప్పొచ్చు అనుకున్నాను. కాకపోతే ఆ నాలుగు పేజీలు కూడా సింగిల్ టేక్‌లో చెప్పాలి. ఎక్కడ కూడా తేడా రాకూడదు. నిజానికి స్టూడియోలో చేసే రియాలిటీ షోలో కట్ చేయొచ్చు. కానీ ఇందులో కంటెస్టెంట్స్ నా ఎదురుగానే ఉంటారు. ఏదైనా సరే సింగిల్ టేక్‌లోనే చెప్పాలి.

మీరంటే పిల్లలకు కూడా ఇష్టం కదా? ఈ షో పిల్లలకు కూడా నచ్చుతుందా?
7, 8 ఏళ్ల చిన్నపిల్లల నుంచి ఈ షో అందరికీ నచ్చేలా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కూడా ఈ షోకి చాలా పాపులారిటీ ఉంది, ఫాలోయింగ్ ఉంది.

జాంబీ రెడ్డి 2 గురించి?
రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశాం. చాలా క్రేజీ ఎంటర్‌టైనర్ చేయాలనే ప్రయత్నం.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.