Skip to content

ఘనంగా ‘తీరం’ సినిమా టైటిల్ సాంగ్ విడుదల

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ, ‘తీరం’ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాత, సాంకేతిక నిపుణులు, నటీనటులు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా సినిమాను అత్యంత నాణ్యతతో రూపొందిస్తున్నామని, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సినిమా అందంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.

నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ, దర్శకుడు వంశీ మునగాల కథ వినిపించిన వెంటనే ఎంతో నచ్చిందన్నారు. కథపై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. చిత్ర బృందం ఎంతో అంకితభావంతో పనిచేసిందని, ప్రేక్షకులకు తప్పకుండా మంచి సినిమా అందిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.

హీరో ప్రభు మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్స్‌తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌లో హీరోగా నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు, నిర్మాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడి నటించానని చెప్పారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరారు.

నటుడు జగదీష్ మాట్లాడుతూ, ‘తీరం’ అనే టైటిల్ చాలా అర్థవంతంగా ఉందన్నారు. ఈ సినిమా కూడా విజయ తీరానికి చేరాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

చిత్ర హీరోయిన్ హరిప్రియా మాట్లాడుతూ, ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వంశీ మునగాల, నిర్మాత ఉపేందర్ గంగావెల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులందరూ ఎంతో సహకరించారని, ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నటుడు రమణ మాట్లాడుతూ, జీవితంలో ఎంత కష్టపడితే గానీ తీరం చేరలేమని, అదే సందేశాన్ని ఈ సినిమా కూడా ప్రతిబింబిస్తుందన్నారు. ఈ చిత్రంలోని ప్రతి కళాకారుడు తన పాత్రను ఎంతో సహజంగా జీవించాడని, దర్శకుడు వంశీ మునగాల సమన్వయంతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

సంగీత దర్శకుడు సాధ్విక్ సన్స్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ సాంగ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందని, సినిమాలోని మిగిలిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫన్ బకెట్ నటులు ఫణి, మహేష్ మాట్లాడుతూ, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తూ ‘తీరం’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కో-డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ & ఎడిటర్ విజయ్ శెట్టి మాట్లాడుతూ, ఈ చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించిన దర్శకుడు వంశీ మునగాల గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పారు.

టైటిల్ సాంగ్ విడుదలతో ‘తీరం’ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.

నటీనటులు
ప్రభు, హరిప్రియా, వైశాలి, నిరుడి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష తదితరులు.

సాంకేతిక నిపుణులు
బ్యానర్: శ్రీ భవానీ క్రియేషన్స్
నిర్మాత: ఉపేందర్ గంగావెల్లి
దర్శకుడు: వంశీ మునగాల
సంగీత దర్శకుడు: సాధ్విక్ సన్స్
కో-డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ & ఎడిటర్: విజయ్ శెట్టి
సినిమాటోగ్రఫీ: అబ్దుల్ వాలి
వీఎఫ్‌ఎక్స్: అభిలాష్ కన్నయగారి
డీఐ: మిథున్ కుమార్ జానా
సౌండ్ డిజైన్: వంశీ జేడీ
పీఆర్ఓ: పి. గోపి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.