అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర…
ఐదు భారతీయ భాషల్లో విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్

నితీశ్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది అకాడమీ అవార్డులు (ఆస్కార్®️) గెలుచుకున్న విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్‌ఈజీ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా దీపావళి 2026 సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నమిత్ మల్హోత్రా రామాయణ: పార్ట్ 1’ అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. జూలై 30 తెల్లవారుజామున విడుదలైన ఈ ట్రైలర్ హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ గురించి:
విజనరీ మేకర్ నమిత్ మల్హోత్రా నుంచి ప్రపంచంలోనే అత్యంత శాశ్వతమైన మహాకావ్యాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా రూపొందుతున్న రెండు భాగాల భారీ సినీ ప్రయాణం ‘రామాయణ: పార్ట్ 1’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సృష్టి ఆరంభం నుంచి త్రిమూర్తులు మూడు లోకాలను పాలిస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణు, పరివర్తనకు ప్రతీక అయిన శివుడు విశ్వాన్ని నడిపిస్తుంటారు. స్వర్గం, భూమి అశాంతి వైపు సాగుతున్న సమయంలో సమతుల్యతను పునరుద్ధరించేందుకు విష్ణుమూర్తి అవతారమెత్తి భూమిపైకి దిగివస్తాడు. ఈసారి ఆయన శ్రీరాముడు (రణ్‌బీర్ కపూర్)గా జన్మిస్తాడు. మరోవైపు త్రిమూర్తుల వరాలతో అజేయుడు, అమరుడు, అపార జ్ఞానవంతుడు, అత్యంత శక్తిమంతుడైన రాక్షసరాజు రావణుడు (యశ్) అహంకారం, ప్రతీకారంతో విశ్వాన్నే కుదిపేసే శక్తిగా నిలుస్తాడు.
రావణుడిని ఎదుర్కొనేందుకు విధి నిర్ణయించిన వ్యక్తి తానేనని తెలియని శ్రీరాముడు, ధర్మానికి ప్రతీకగా, అయోధ్య యువరాజుగా అందరి ప్రేమాభిమానాలను పొందుతాడు. తన ప్రియమైన భార్య సీత (సాయి పల్లవి), నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడు (రవీ దూబే)తో ప్రశాంతమైన జీవితం గడపాలని భావిస్తాడు. అయితే విధి అతన్ని వనవాసానికి నడిపిస్తుంది. ఆ ప్రయాణం చివరికి రావణుడితో దేవతల, మానవుల భవిష్యత్తునే నిర్ణయించే మహా సంగ్రామానికి దారి తీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన కథలను తెరకెక్కించిన దర్శకుడు నితీశ్ తివారి, భారతీయ భావోద్వేగాలు, సంస్కృతిని కాపాడుతూ ‘దంగల్’ వంటి చిత్రాలతో చైనా సహా పలు దేశాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించారు. అలాంటి దర్శకుడితో పాటు భారతీయ సినీ పరిశ్రమలోని పలు తరాల అత్యుత్తమ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. తరతరాల భారతీయుల మనసుల్లో శ్రీరాముడిగా చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్, ఈ చిత్రంలో శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. దిగ్గజ నటి శోభన కైకేసి పాత్రలో నటిస్తుండగా, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు.
ఈ అద్భుతమైన తారాగణానికి నాయకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్, తరతరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే, ధర్మానికి శాశ్వత ప్రతీక అయిన శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. సాయి పల్లవి చరిత్రలో అత్యంత ఆరాధనీయమైన మహిళల్లో ఒకరైన మాత సీత పాత్రలో తన హుందాతనం, ఆత్మబలం, కరుణను ఆవిష్కరించనున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ రాకింగ్ స్టార్ యశ్, తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, భారతీయ ఇతిహాసాల్లో అత్యంత శక్తిమంతమైన, అజేయమైన ప్రతినాయకుల్లో ఒకరైన రావణుడు పాత్రను పోషిస్తున్నారు.
అవార్డు గ్రహీత అయిన స్క్రీన్ రైటర్ శ్రీధర్ రాఘవన్ అనుసరణలో రూపొందిన రామాయణం, ఆస్కార్ విజేతలైన హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ అసాధారణ తారాగణం, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన క్రియేటర్స్ తో భారతీయ ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న నిర్మాత నమిత్ మల్హోత్రా దృష్టికి నిదర్శనం. మానవాళి చరిత్రలో అత్యంత ప్రాచీనమైన, శాశ్వతమైన కథల్లో ఒకటైన రామాయణాన్ని, ఇంతవరకు ఎప్పుడూ ప్రయత్నించని స్థాయి, ప్రామాణికత, సినీ వైభవంతో ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ చిత్రం రూపొందుతోంది.
నిర్మాత, ‘రామాయణ’ క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ…
“రామాయణం మన గొప్ప మహాకావ్యాల్లో ఒకటి మాత్రమే కాదు. అది మన జీవన విధానంలో భాగం. మనం ఎలా జీవిస్తామో, ఎలా సంబరాలు చేసుకుంటామో, మన విలువలను ఒక తరం నుంచి మరో తరానికి ఎలా అందిస్తామో దాంట్లో రామాయణం భాగస్వామిగా ఉంటుంది. ప్రతి ఏడాది దసరా, దీపావళి వెలుగు చీకటిపై, ధర్మం అధర్మంపై సాధించిన విజయాన్ని మనకు గుర్తు చేస్తాయి. వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన కథ నేటికీ కోట్లాది మంది దైనందిన జీవితాలను ప్రభావితం చేయడం చాలా అరుదు. అలాంటి కథే రామాయణం.
ప్రపంచ సినీ పరిశ్రమలో నా జీవితంలో చాలా కాలం గడిపిన తర్వాత, భారతదేశంలోని గొప్ప కథలు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వేదికపై నిలవాలని నేను ఎప్పుడూ నమ్మాను. ఈ రోజు ఆ స్థాయిలో వాటిని ఆవిష్కరించడానికి అవసరమైన కళాకారులు, సాంకేతికత, నైపుణ్యం, సంకల్పం మనకు ఉన్నాయి. ఈ అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని అది ప్రామాణికత, స్థాయి, సినీ వైభవంతో ప్రపంచ ప్రేక్షకులకు అందించే సమయం వచ్చింది.
ఇది కేవలం ఒక సినిమా ప్రారంభం మాత్రమే కాదు. భారతదేశ సాంస్కృతిక సంపదను ప్రపంచంతో పంచుకునే ఒక మహా ప్రయాణానికి ఇది నాంది. భారతదేశం ఈ కథను ఎప్పటినుంచో జీవిస్తోంది. ఇప్పుడు దాన్ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.”
దర్శకుడు నితీశ్ తివారి మాట్లాడుతూ…
“రామాయణం ఇప్పటివరకు చెప్పబడిన గొప్ప కథల్లో ఒకటి. దానికి కారణం దాని వైభవం కాదు, అది ప్రతిబింబించే శాశ్వతమైన విలువలు. దర్శకుడిగా దానిని ప్రపంచవ్యాప్త కథగా మార్చాల్సిన బాధ్యత నాకు ఎప్పుడూ అనిపించలేదు. అది ఇప్పటికే విశ్వవ్యాప్తమైన కథ. నా బాధ్యత దానిని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో, అత్యంత గౌరవంతో తెరకెక్కించడమే.
రచన నుంచి నటన వరకు, ప్రొడక్షన్ డిజైన్, సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్, తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్ వరకు తీసుకున్న ప్రతి సృజనాత్మక నిర్ణయం ఒకే ఆలోచనతో జరిగింది. ఈ అసాధారణ వారసత్వాన్ని అది అర్హమైన గౌరవంతో నిలబెట్టడంతో పాటు అత్యుత్తమ సినీ నైపుణ్యంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేదే మా లక్ష్యం.
ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులు, కథకులతో కలిసి ఈ విజన్‌కు రూపం ఇవ్వడం నా జీవితంలో దక్కిన గొప్ప అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ‘రామాయణం’లో కేవలం విజువల్ స్పెక్టాకిల్‌ను మాత్రమే కాకుండా, వేల సంవత్సరాలుగా నిలిచిన భావోద్వేగం, మానవత్వం, శాశ్వత స్ఫూర్తిని కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను.”
డీఎన్‌ఈజీ (DNEG) గురించి
డీఎన్‌ఈజీ (DNEG) ప్రపంచంలోనే అగ్రగామి విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ సంస్థల్లో ఒకటి. సినిమాలు, టెలివిజన్, ఇమర్సివ్ కంటెంట్ సృష్టిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థకు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాలో కార్యాలయాలు, స్టూడియోలు ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల అనుభవం కలిగిన డీఎన్‌ఈజీ, 2011 నుంచి ఇప్పటివరకు ‘విజువల్ ఎఫెక్ట్స్’ విభాగంలో ఎనిమిది అకాడమీ అవార్డులు (ఆస్కార్®️) గెలుచుకోవడంతో పాటు, తన అద్భుతమైన పనితీరుకు గాను అనేక బాఫ్టా, ప్రైమ్‌టైమ్ ఎమ్మీ®️, విజువల్ ఎఫెక్ట్స్ సొసైటీ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ రానున్న ప్రాజెక్టుల్లో ‘కయోటీ వర్సెస్ అక్మీ’ (ఆగస్టు 2026), ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (ఆగస్టు 2026), ‘క్లారా అండ్ ది సన్’ (అక్టోబర్ 2026), ‘స్ట్రీట్ ఫైటర్’ (అక్టోబర్ 2026), ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ – సీజన్ 3’ (నవంబర్ 2026), ‘ది క్యాట్ ఇన్ ది హ్యాట్’ (నవంబర్ 2026), ‘రామాయణ: పార్ట్ 1’ (నవంబర్ 2026), ‘బ్లేడ్ రన్నర్ 2099’ (నవంబర్ 2026), ‘లూనీ ట్యూన్స్: డాఫీ సీజన్’ (నవంబర్ 2026), ‘ది ఆంగ్రీ బర్డ్స్ మూవీ 3’ (డిసెంబర్ 2026), ‘అబవ్ ది బిలో’ (డిసెంబర్ 2026), ‘యానిమల్ ఫ్రెండ్స్’ (జనవరి 2027), ‘బ్యాడ్ ఫెయిరీస్’ (మే 2027), ‘మార్జీ క్లాస్’ (నవంబర్ 2027), అలాగే ‘అలోన్ ఎట్ డాన్’, ‘ఎస్‌ఏఎస్: రోగ్ హీరోస్ సీజన్ 3’, ‘ఆన్ ది లైన్’, ‘రోడ్ హౌస్ 2’, ‘స్నూపీ అన్‌లీష్డ్’, ‘బ్లడ్ ఆన్ స్నో’, ‘దిస్ సిటీ ఈజ్ అవర్స్ సీజన్ 2’, ‘బ్లాక్ ప్యాలెస్’, ‘గండామ్’ ఉన్నాయి.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ గురించి
దర్శకుడు, నిర్మాత నమిత్ మల్హోత్రా స్థాపించిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు, టెలివిజన్, గేమింగ్ రంగాల్లో వినూత్నమైన, ఆకట్టుకునే కంటెంట్‌ను ఫైనాన్స్ చేసి నిర్మిస్తోంది. ఇటీవల సోనీ పిక్చర్స్ కోసం అల్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్తో కలిసి నిర్మించిన యానిమేటెడ్ చిత్రం ‘ది గార్‌ఫీల్డ్ మూవీ’ ప్రపంచవ్యాప్తంగా 257 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్, ర్యాన్ రెనాల్డ్స్ నిర్మాణ సంస్థ మ్యాక్సిమమ్ ఎఫర్ట్తో కలిసి ‘యానిమల్ ఫ్రెండ్స్’ లైవ్-యాక్షన్/యానిమేషన్ హైబ్రిడ్ చిత్రాన్ని, అలాగే రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, సేగా, ఫ్లైవీల్ మీడియా, వన్ కూల్ గ్రూప్, డెంట్సు భాగస్వామ్యంతో పారామౌంట్ పిక్చర్స్ కోసం ‘ది ఆంగ్రీ బర్డ్స్ మూవీ 3’ను నిర్మిస్తోంది. అలాగే, 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ మహాకావ్యం ఆధారంగా రూపొందుతున్న రెండు భాగాల భారీ చిత్రం *’రామాయణ’*ను కూడా నిర్మిస్తోంది. ప్రపంచ ప్రేక్షకులకు ఈ మహాకావ్యాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని సినీ వైభవంతో అందించడంతో పాటు, విస్తృతమైన ట్రాన్స్‌మీడియా యూనివర్స్‌కు శ్రీకారం చుట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ గురించి
రాకింగ్ స్టార్ యశ్ స్థాపించిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ స్వతంత్ర నిర్మాణ సంస్థ. సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడం, సినీ కథనాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే వినూత్నమైన కంటెంట్‌ను అందించడం ఈ సంస్థ లక్ష్యం.
ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్తో కలిసి ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’, అలాగే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్తో కలిసి ‘రామాయణ’ వంటి రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు ఈ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

