Skip to content

‘పళ్ళ బురుసు’ చిత్రం ట్రైలర్ విడుదల

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైలర్‌ను డిజిటల్ విడుదలకు ముందే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున లచ్చపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ‘పళ్ళ బురుసు’ సినిమా షూటింగ్ లచ్చపేట గ్రామంలోనే జరిగింది. అందుకే ఈ ట్రైలర్‌ను ముందుగా మీ అందరికీ చూపించి విడుదల చేయాలనుకున్నాం. మీ అందరి ప్రేమ, ఆదరణ చూసి చాలా ఆనందంగా అనిపించింది” అన్నారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా లచ్చపేట గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఓ తండ్రి తన కొడుకుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కారణం ఏమిటంటే… తనకు టూత్‌బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టడం. ఇంత చిన్న విషయానికి ఫిర్యాదు చేయడమేంటని పోలీసులు సర్ ప్రైజ్ గురవుతారు. కానీ ఆ చిన్న ఫిర్యాదు వెనుక ఒక తండ్రి మనసులో దాగి ఉన్న పెద్ద బాధ ఉందనే విషయం క్రమంగా రివిల్ అవుతుంది.

ట్రైలర్ ముందుకు సాగేకొద్దీ తండ్రి-కొడుకుల మధ్య పెరిగిన భావోద్వేగ, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి హృదయాన్ని తాకేలా చూపించారు. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరుగుతూ, కథానాయకుడు తన సమాధిని తానే తవ్వుకోవడం మరింత ఆసక్తిని పెంచుతుంది.

నవ్వించే సన్నివేశాలతో పాటు మనసును కదిలించే భావోద్వేగాలను అందంగా మిళితం చేసిన ‘పళ్ళ బురుసు’, కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య మారుతున్న అనుబంధాలు, ఒక తండ్రి ఆవేదనను తాకేలా చెప్పబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

సినిమాటోగ్రాఫర్ వినోద్ కె. బంగారి గ్రామీణ నేపథ్యాన్ని సహజత్వంతో అద్భుతంగా ఆవిష్కరించగా, పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదం, భావోద్వేగాలను ఎలివేట్ చేసింది.

కథలోని ప్రధాన సంఘర్షణను పూర్తిగా బయటపెట్టకుండా, ‘పళ్ళ బురుసు కేసు’ వెనుక అసలు కారణమేంటి? తండ్రి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

ట్రైలర్ తో ‘పళ్ళ బురుసు’ వినోదంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను పంచుతూ, ఆగస్టు 14న ప్రేక్షకులను ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా అలరించబోతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.