Skip to content

‘రామాయణం’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే ‘జై జై రామ్’ రిలీజ్

‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది.

ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ: “శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా భావిస్తున్నాం. కష్ట సమయాల్లో ఆయన బలాన్ని కోరుకుంటాం. అనిశ్చితి ఎదురైనప్పుడు ఆయన చూపిన మార్గాన్ని చూస్తాం. ఆనంద సమయంలో కృతజ్ఞతతో ఆయనను స్మరించుకుంటాం. ‘జై జై రామ్’ పాట శ్రీరాముడితో మనకున్న ఈ వ్యక్తిగతమైన, శాశ్వతమైన అనుబంధం నుంచి వచ్చింది. ‘రామాయణం’ను ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నప్పటికీ.. దాని అసలైన పునాది భావోద్వేగం, విలువలు, భక్తి. ‘జై జై రామ్’తో మా తొలి పాట ఆ ఆత్మను ప్రతిబింబించాలని కోరుకున్నాం. మనం ఆరాధించే వ్యక్తిగా మాత్రమే కాకుండా.. మనలోని రక్షకుడిగా, మార్గదర్శిగా, బలానికి మూలంగా శ్రీరాముడిని ఈ పాట ద్వారా సెలబ్రేట్ చేయాలనుకున్నాం.”

ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ: “‘జై జై రామ్’ పాటకు హృదయం శ్రీరాముడి నామాన్ని శక్తివంతంగా పదే పదే స్మరించడమే. సంగీతపరంగా ఒక ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతను కాపాడుతూ.. అదే సమయంలో ఆ కంపోజిషన్ సినిమాటిక్ సాంగ్‌గా ఎదిగేలా చేయాలనుకున్నాం. రకేందు మౌళి రాసిన సాహిత్యానికి దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ తమదైన భావోద్వేగ వోకల్స్ అందించారు. అదే సమయంలో పాటలోని భక్తి భావానికి నిజాయితీగా నిలిచారు. ప్రేక్షకులకు ఈ పాట శాంతిని, అనుబంధాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.”

రాకేందు మౌళి మాట్లాడుతూ: “‘జై జై రామ్’.. మూడు సులభమైన పదాలే. కానీ వాటిలో ఒక సంపూర్ణమైన ప్రార్థన ఉంది. ఈ పాట రాసేటప్పుడు నా ఉద్దేశం శ్రీరాముడిని వర్ణించడం కాదు. ఎందుకంటే ఆయన అర్థాన్ని పదాల్లో పూర్తిగా ఇమడ్చలేం. ప్రతి భక్తుడికి శ్రీరాముడితో ఉన్న అనుబంధాన్ని.. మన మార్గదర్శిగా, మన బలంగా, మనకు ఆశ్రయంగా ఆయనను భావించే తీరును వ్యక్తీకరించాలనుకున్నాను. నిజమైన భక్తికి ఎలాంటి అలంకరణ అవసరం ఉండదు కాబట్టి భాషను సింపుల్‌గా, నేరుగా ఉంచాను. ఈ పాట విన్నప్పుడు ప్రేక్షకులు కేవలం పాటను వినకుండా.. అందులో తమ స్వంత ప్రార్థనను కూడా కనుగొంటారని ఆశిస్తున్నాను.”

ఇటీవల విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భారీ స్పందనకు కొనసాగింపుగా ‘జై జై రామ్’ పాట విడుదలైంది. ఈ ట్రైలర్ కేవలం ఆరు రోజుల్లోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి ఒక బిలియన్ వ్యూస్ దాటింది.

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిదిసార్లు అకాడమీ అవార్డు గెలుచుకున్న DNEG, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

‘రామాయణం పార్ట్ వన్’ 2026 దీపావళికి థియేటర్లలోకి రానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.