'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి…
‘రామాయణ’ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
- దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
నవరాత్రుల తొలి రోజును పురస్కరించుకుని ‘రామాయణ’ మేకర్స్ ప్రత్యేక ప్రకటన చేశారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఇతిహాస చిత్రంలో పార్ట్ 1 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. “యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై” (ఇది రాముడి యుగానికి ఆరంభం) అనే సందేశంతో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే కనిపిస్తున్నారు. వీరి వెనుక రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ భారీగా కనిపిస్తూ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కథలోని ప్రధాన పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. భారీ సెట్లు, అద్భుతమైన వస్త్రధారణ, ప్రతి అంశంలోనూ చూపించిన ప్రత్యేక శ్రద్ధ.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను పంచుకుంటూ.. “నవరాత్రుల పవిత్ర సందర్భంగా కొత్త శకారంభాన్ని జరుపుకుంటున్నాం. యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై. నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ పార్ట్ 1 నవంబర్ 5 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం” అని ప్రకటించారు.
ప్రపంచంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ విజేతగా నిలిచిన DNEGతో కలిసి, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారత్‌లో హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. IMAX ఫార్మాట్‌లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుండగా, హిందీ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది.

