Skip to content

చిరంజీవి ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ

దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో భారతీయ సినిమా ప్రేక్షకులని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

భారతీయ సినిమాలో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న దిగ్గజాల్లో ఒకరైన చిరంజీవి, ప్రపంచంలోనే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన సంభాషణలు, ఆకట్టుకునే కథలు, చిరంజీవి చరిష్మా, చమత్కారం, తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఈ షో సాగనుంది. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి మరో ప్రత్యేకమైన కోణాన్ని జోడించనుంది.

తరతరాల ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం కలిగిన మెగాస్టార్ చిరంజీవి తన ఆప్యాయత, స్పాంటినిటీ, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ కొత్త వేదికపై కనిపించనున్నారు. దీంతో ప్రేక్షకులు ఆయనలోని మరో కోణాన్ని తెలుసుకోనున్నారు.

తెలుగు సినిమా లెగసీ, దిగ్గజాలు, వారి అద్భుతమైన ప్రయాణాలను సెలబ్రేట్ చేసుకునేలా ‘చిరంజీవీస్ మెగావర్స్’ రూపొందుతోంది. తెలుగు సినిమా ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన ప్రముఖుల జీవితాలు, వారి అనుభవాలను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశాన్ని ఈ షో కల్పించనుంది. సినిమాపై మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రేమ, సినీ రంగంతో పాటు ప్రేక్షకులతో ఆయనకున్న గొప్ప అనుబంధం ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ LLP సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ‘చిరంజీవీస్ మెగావర్స్’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.