Skip to content

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న ‘సోగ్గాడు’

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న ‘సోగ్గాడు’ Telugu News
స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న ‘సోగ్గాడు’ Telugu News

నటభూషణ శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి…అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత ‘సోగ్గాడు’ శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి.

ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పోస్టర్ ను హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో తాము తీసిన ‘సర్పయాగం’ చిత్రం అనుభూతిని పంచుకుంటూ ఇదే రామానాయుడు స్టూడియోలోని సెకండ్ ఫ్లోర్ లో సంధ్యా సమయం లోని ఒక షాట్ ను చాలా గొప్పగా చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఆ చిత్రీకరణలో అస్తమిస్తున్న సూర్యుని చూసి, శోభన్ బాబు తన చేతులను చూసుకుని పలికించిన అద్భుతమైన నటన తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు.
అలనాటి ‘మానవుడు దానవుడు’ చిత్రం తనకు ఎప్పటికీ ఇష్టమైన చిత్రంగా పేర్కొన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ తనకే కాదు ప్రతీ ఒక్కరినీ అలరించిందని అన్నారు. అలాగే ఒకప్పుడు విజయా, సురేష్ మూవీస్ సంస్థలు కలిసి కొన్ని చక్కటి చిత్రాలు తీశాయని, అటుపిమ్మట సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి…రెండు, మూడు చిత్రాలను నిర్మించిన తర్వాత తీసిన ‘సోగ్గాడు’ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పారు.

సీనియర్ దర్శకుడు కె.మురళీమోహనరావు మాట్లాడుతూ, ‘సోగ్గాడు’ చిత్రానికి తాను అసోసియేట్ దర్శకుడిగా పనిచేశానని, ఆ సినిమా చిత్రీకరణ సమయంలోని పలు అనుభవాలను పంచుకున్నారు.

మరో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, శోభన్ బాబు కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించిన ‘సంసారం’ చిత్రం గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా అయన క్రమశిక్షణ, వ్యక్తిత్వాన్ని స్వయంగా కళ్ళారా చూశానని చెప్పారు.

See also  పవర్, న్యాయం మధ్య పోరాటాన్ని తెలిపే 'SYSTEM' ట్రైలర్ విడుదల

ఇంకో సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తన అనుభవాలను పంచుకుంటూ…శోభన్ బాబు తో తాను తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించానని వివరిస్తూ, ఆయన గొప్ప ఆలోచనాపరులని, ఫిలాసపర్
అని చెప్పుకొచ్చారు.

శోభన్ బాబుతో ‘మహరాజు’, ‘బావా మరదళ్ళు’ సినిమాలు తీసిన నిర్మాత రాశీ మూవీస్ నరసింహారావు మాట్లాడుతూ, శోభన్ బాబు నటనను, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ప్రసంగించారు.

శోభన్ బాబు కుటుంబం తరపున మేనల్లుడు, ప్రముఖ బిల్డర్ గద్దె నవీన్, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ సుధాకర్ బాబు, కన్వీనర్ సాయి కామరాజు, పూడి శ్రీనివాస్, బి. బాలసుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్ రావు, వీరప్రసాద్,
విజయ్ కుర్రా రాంబాబు, తెలంగాణ శోభన్ బాబు అభిమానులు తదితరులు పాల్గొని, స్వర్ణోత్సవానికి ప్రేక్షకాభిమానులందరూ హాజరై, విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

దీనికి సంబంధిం చిన కర్టెన్ రైజర్ త్వరలో ఉంటుందని వారు తెలిపారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.