Skip to content

రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్

రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ (BTS) గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించడంతో పాటు.. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక పాత్ర కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూపించారు.

ఈ BTS వీడియోలో దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘రామాయణం’లాంటి సినిమాకు సరైన నటుడిని ఎంపిక చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ఇతిహాసంతో కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసం, భావోద్వేగ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడి పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపారు.

శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ కూడా ఈ పాత్ర గురించి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ పాత్రను తాను మరో సినిమా లేదా మరో క్యారెక్టర్‌లా చూడలేదని.. శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయడం ఒక బాధ్యతగా భావించానని రణ్‌బీర్ తెలిపారు.

ఈ BTS గ్లింప్స్‌లో రణ్‌బీర్ సహనటులు కూడా ఆయన గురించి మాట్లాడారు. దశరథుడిగా నటిస్తున్న అరుణ్ గోవిల్, సీత పాత్రలో సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే.. శ్రీరాముడి పాత్రకు రణ్‌బీర్ ఎందుకు సరిపోయారో వివరించారు. నటీనటుల లుక్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ వీడియోలో చూపించారు. దీంతో ఈ భారీ ఇతిహాసాన్ని తెరకెక్కించడం వెనుక ఉన్న మేకింగ్‌పై అభిమానులకు ప్రత్యేకమైన గ్లింప్స్ లభించింది.

ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ కోసం ఈస్ట్‌లోని అత్యుత్తమ ప్రతిభను, వెస్ట్‌లోని అత్యుత్తమ టెక్నికల్ టాలెంట్‌ను ఒకే ఆలోచనతో కలిపిన విధానాన్ని కూడా ఈ BTS వీడియోలో చూపించారు. ‘రామాయణం’ను ప్రపంచస్థాయి చిత్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రతిభావంతులను కూడా భాగం చేశారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ టెర్రీ నోటరీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాగా.. సినిమాలోని క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రణ్‌బీర్‌కు ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

‘రామాయణం’లోని సాంస్కృతిక అంశాలను హైలైట్ చేస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యాక్షన్, స్టంట్ నిపుణులు తమ నైపుణ్యాన్ని అందిస్తున్న తీరును కూడా ఈ BTS గ్లింప్స్‌లో చూపించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో తెరకెక్కుతోందో మరోసారి అర్థమవుతోంది.

‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త BTS గ్లింప్స్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాసం, ఇందులోని భారీ తారాగణంపై మరింతగా చర్చ జరుగుతోంది.

ప్రపంచంలోనే అత్యంత గౌరవించబడే ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.

నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్.. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. ‘రామాయణం’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇండియా మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. హిందీ మార్కెట్‌లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా IMAXలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి 2026లో, పార్ట్ 2 దీపావళి 2027లో విడుదల కానుంది. భారత్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.