Skip to content

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ రిలీజ్

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ను విడుదల చేశారు. స్నేహబంధంలోని అందమైన అనుభూతులను గుర్తుచేసేలా ఈ పాట సాగింది.

వివేక్ సాగర్ స్వరపరిచిన ‘మిత్వా’ వినసొంపైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. చక్కటి ఆర్కెస్ట్రేషన్, కొత్త తరహా మ్యూజిక్ అరేంజ్‌మెంట్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం స్నేహితులు పక్కన ఉన్నప్పుడు కలిగే ఆనందాన్ని, వారితో కలిసి గడిపిన మధురమైన జ్ఞాపకాలను అందంగా చూపించారు. నకుల్ అభ్యంకర్ తన వాయిస్‌తో పాటకు ప్రాణం పోయగా, వీణా ఘంటసాల వాయిస్ మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.

ఈ పాటకు సంబంధించిన విజువల్స్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. థాయ్‌లాండ్ ట్రిప్‌లో ENE గ్యాంగ్ కలిసి సరదాగా గడిపిన క్షణాలను చూపించారు. అందమైన ప్రదేశాలు, బీచ్‌లలో ఎంజాయ్ చేయడం, పబ్స్‌లో పార్టీలు చేసుకోవడం వంటి సన్నివేశాలతో వారి అల్లరి, స్నేహం, అనుబంధాన్ని చూపించారు. అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కూడా ఈ గ్యాంగ్‌తో కలిసి సందడి చేస్తూ కనిపించారు.

‘ఈఎన్ఈ రిపీట్’ లోని అసలైన ఫన్, ఎమోషన్‌ను ‘మిత్వా’ పాట మరోసారి గుర్తుచేస్తోంది. ఈ పాత్రల మధ్య స్నేహం, వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎందుకు అంతగా నచ్చాయో ఈ పాట చూస్తే అర్థమవుతుంది. కేవలం ఒక మెలోడీగానే కాకుండా, స్నేహంలోని అల్లరి, ఆనందం, అనుబంధాలను గుర్తుచేసే పాటగా ‘మిత్వా’ ఆకట్టుకుంటోంది.

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌ను ‘మిత్వా’ పాటతో మ్యూజికల్‌గా ప్రారంభించిన ‘ENE Repeat’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. తమ అభిమాన గ్యాంగ్‌ను మరోసారి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందించగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌.

నటీనటులు: విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను

టెక్నికల్ :
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
ప్రొడక్షన్ హౌసెస్: ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
కో-డైరెక్టర్: ఉపేంద్ర వర్మ
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సౌమిత్రి ఎన్
లైన్ ప్రొడ్యూసర్: శ్రీను ఇర్ల
మార్కెటింగ్ & మోషన్ పోస్టర్: వాల్స్ & ట్రెండ్స్
పీఆర్ఓ: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.