Skip to content

‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా సినిమాలోని పలు అంశాల గురించి చిత్ర బృందంతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.

దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటనను ప్రశంసించిన మెగాస్టార్, తొలి చిత్రంతోనే సాత్విక ఎంతో పరిణతితో కూడిన నటనను కనబరిచిందని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు పవన్ సాధినేని కథను అద్భుతంగా తెరకెక్కించారని, భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేయడంలో సఫలమయ్యారని కొనియాడారు. రోహిణి శర్మ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసించారు.

సినిమాలో తనను ఎంతగానో కదిలించిన పలు సన్నివేశాలను చిత్ర బృందంతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తన భావోద్వేగాలను పంచుకున్నారు మెగాస్టార్. ముఖ్యంగా ద్వితీయార్థంలో శృతి హాసన్, సాత్విక పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశం తనను ఎంతగానో కదిలించిందన్నారు. సాత్విక తన కలను సాకారం చేసుకునే సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు ‘చివరికి తను సాధించింది’ అనే ఆనందంతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగంగా పంచుకున్నారు.

సాంకేతికంగా కూడా సినిమా అత్యున్నత స్థాయిలో ఉందని, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇలాంటి గొప్ప కథను వెండితెరపైకి తీసుకొచ్చిన నిర్మాతలు స్వప్న దత్, గుణ్ణం సందీప్, గీతా ఆర్ట్స్‌కు చెందిన విద్య ని ప్రత్యేకంగా అభినందించారు.

‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి ఎన్నో అవార్డులు వస్తాయని ఆకాంక్షించిన మెగాస్టార్, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని రావాలని, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇటువంటి సినిమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ ఆత్మీయ సమావేశంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్‌తో సినిమా విశేషాల గురించి ముచ్చటిస్తూ, చిత్రంపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.

తమను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి, సినిమాలోని ప్రతి అంశాన్ని ఎంతో ప్రేమతో విశ్లేషిస్తూ అభినందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.